
ఏపీ అసెంబ్లీ (AP Assembly) ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఎంత కీలకపాత్ర పోషించారో అందరికీ తెలిసిందే. జనసేన (Janasena) నుంచి పోటీచేసిన అభ్యర్థులను గెలిపించుకోవడంతో పాటు.. బీజేపీ, టీడీపీ అభ్యర్థులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో భారీ బహిరంగసభలు నిర్వహించి.. తన గళంతో విజయాన్ని అందుకున్నారు. తాజాగా వెల్లడైన మహారాష్ట్ర ఫలితాలను చూస్తే.. పవన్ ఎక్కడుంటే అక్కడ విజయం ఖాయమని చెప్పాల్సిందే. మహారాష్ట్రలో బీజేపీ అభ్యర్థుల తరపున 5 స్థానాల్లో పవన్ ప్రచారం చేయగా.. ఆ ఐదుగురూ గెలవడం విశేషం.
ఈ విషయంపైనే.. మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) ఇన్ స్టా వేదికగా ఓ పోస్టు పెట్టారు. తన తమ్ముడిని ఆకాశానికెత్తేస్తూ.. పొగడ్తల వర్షం కురిపించారు. “గెలిచే ప్రతి నాయకుడు హీరోనే, కాని ప్రతి హీరో నాయకుడు కాలేడు.. నాయకుడంటే గెలిచే వాడే కాదు.. నమ్మిన సిద్ధాంతాల కోసం సైధ్దాంతిక విలువల కోసం.. అవి నమ్మి నడిచే వ్యక్తుల కోసం.. నీడై నిలబడేవాడు. తోడై నడిపించేవాడు. వారి గమ్యంలో గెలుపుని చూసుకునే వాడు. వారి గెలుపులో మరో గమ్యాన్ని వెతుక్కునే వాడు. అలాంటి అరుదైన నాయకుడే నా నాయకుడు. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్ పవన్ కల్యాణ్ ( Political Game Changer Of Current Indian Politics) ” అని కితాబిచ్చారు.