
ఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టులో టీమిండియా విజయం దిశగా దూసుకెళ్తున్నది. యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లీ సెంచరీలకు తోడు మూడో రోజే ఆసిస్ పతనం మొదలవడంతో భారత్ తిరుగులేని స్థితిలో నిలిచింది. అద్భుతం జరిగితే తప్ప విజయం దాదాపు ఖాయమే. బుమ్రా ధాటికి ఆసిస్ మూడో రోజే మూడు వికెట్లు కోల్పోగా.. మరో 7 వికెట్లు తీస్తే మ్యాచ్ మనదే. పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజూ భారత్‌దే. ఆదివారం ఓవర్‌నైట్ స్కోరు 170/0తో ఆట కొనసాగించిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌ను 487/6 స్కోరు వద్ద డిక్లేర్డ్ ఇచ్చింది. యశస్వి జైశ్వాల్(161, 297 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ సెంచరీతో రాణించగా.. కోహ్లీ(140 నాటౌట్, 143 బంతుల్లో 8 ఫోర్లు, 2సిక్స్‌లు) కదం తొక్కాడు. తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల ఆధిక్యం కలుపుకుని భారత్.. ఆసిస్ ముందు 534 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. ఛేదనలోనూ కంగారుల జట్టు తడబడింది. మూడో రోజు ఆఖర్లో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఆ జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. బుమ్రా మరోసారి వికెట్ల వేట మొదలుపెట్టాడు. రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. తొలి ఓవర్లోనే ఆసిస్‌కు షాకిచ్చిన అతను..ఓపెనర్ మెక్‌స్వీనీ(0)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కాసేపటికే ప్రమోషన్‌పై ఫస్ట్ డౌన్లో వచ్చిన కెప్టెన్ కమిన్స్(2)ను సిరాజ్ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాతి ఓవర్లోనే బుమ్రా.. లబుషేన్(3)ను అవుట్ చేశాడు. ఆ బంతి తర్వాత అంపైర్లు మూడో రోజు ముగిసినట్టు ప్రకటించారు. ఆసిస్ చేతిలో ఇంకా 7 వికెట్లు ఉండగా.. ఆ జట్టు ఇంకా 522 పరుగులు చేయాల్సి ఉంది.
Editor: Ramesh Rao
All Rights Reserved | 3S News - 2025