
ఉత్తరప్రదేశ్(Uttarapradesh) రాష్ట్రంలో బీజేపీ(BJP) రెండు సార్లు భారీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికి ఓ నియోజకవర్గంలో మాత్రం కాషాయ పార్టీ గత 30 సంవత్సరాలుగా ఒక్కసారి కూడా గెలిచింది లేదు. అయితే తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం కాషాయ పార్టీ.. గత చరిత్రను తిరగ రాస్తు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆ నియోజకవర్గంలో విజయం దిశగా ముందుకు సాగుతోంది. వివరాల్లోకి వెళితే.. యూపీలోని కుండార్కి నియోజకవర్గానికి(Kundarki Constituency) ఉప ఎన్నికలు(By-elections) జరిగాయి. ఈ నియోజకవర్గంలో 60 శాతం ముస్లిం ఓటర్లు ఉన్నారు. దీంతో రాష్ట్రం మొత్తం బీజేపీ(BJP) గెలిచినప్పటికీ ఇక్కడ మాత్రం ఆ పార్టీకి గతంలో పరాభవం తప్పలేదు. కానీ తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం ఎవరూ ఊహించని విధంగా కమలం పార్టీ విజయం దిశగా ముందుకు సాగుతోంది.
11 మంది ముస్లిం అభ్యర్థులతో పోటీ పడిన బీజేపీ అభ్యర్థి రామ్‌వీర్ సింగ్(Ramveer Singh) 19 రౌండ్లు ముగిసే సమయానికి 98,537 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయనకు మొత్తం 1,11,470 ఓట్లు రాగా.. సమీప అభ్యర్థి మహమ్మద్ రిజ్వాన్‌కు 12,933 ఓట్లు వచ్చాయి. కాగా ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నప్పటికీ.. మిగిలిన రౌండ్లలో లెక్కించాల్సిన ఓట్ల కంటే.. ప్రస్తుతం ఆయన లీడ్ అధికంగా ఉండటంతో.. ఈ ఉప ఎన్నికలో కుండార్కి నియోజకవర్గం నుంచి రామ్ వీర్ సింగ్ విజయం ఖాయమైంది. దీంతో 30 సంవత్సరాల తర్వాత కుండార్కి నియోజకవర్గంలో కాషాయ జెండా రెపరెపలాడుతుంది.